సండే స్పెషల్!!!
మనిషికి రెండు కిడ్నీల లాగా ఎంచక్కా రెండుగుండెలు ఉంటే...
(ఆదివారం-గుండె నిండా నవ్వుకోండి)
మన హృదయాన్ని ఎడాపెడా ఇంకా ఎక్కువమందికి పంచేయచ్చు!
ప్రతిసారి ప్రేమికులు రెండు గిఫ్ట్లు, రెండు పూలగుత్తులు ఇస్తూ ఉండాలి!
ప్రేమికుల గుండెకు గాయం అయినా పగిలిపోయినా ఇబ్బందే లేదు – “రెండో గుండెతో” ఇంకోళ్ళని చూసుకోవచ్చు!
“గుండెల దాన శిబిరాలు” బాగా వెలుస్తాయి- రక్తదాన శిబిరాల్లాగా!
"నీ కోసం నాగుండె కొట్టుకుంటోంది" బదులు "నా గుండెలు కొట్టుకుంటున్నాయి నీ గుండెల్ని చూసి" అని అనాల్సివస్తుంది!
ప్రతి సినిమా చివర సీనూ “గుండెల దానంతో” ముగుస్తుంది!
హృద్రోగనిపుణులు తమ రెండుగుండెలతో-రోగి రెండుగుండెల చప్పుడు వినాల్సివస్తుంది!
రెండో గుండె ఉంది కదా అని ఇంకో గుండె “పనిచేయడానికి బద్దకించొచ్చు”!
ప్రేమకి చిహ్నంగా ప్రతిచోటా “నాలుగు గుండెల” పిక్చర్ వేయాల్సి ఉంటుంది! ఇప్పటిలాగా కాకుండా- “రెండు చేతులతో రెండు గుండెలు పట్టుకున్నట్టు” చూపించాలి సినిమాల్లో- గుండెల నొప్పి సీన్లలో!
"గుండెల మీద తన్నావు" “నీ గుండెల్లో నిద్రపోతాను” అనే డైలాగ్స్ కి నిజమైన అర్ధం, సార్ధకత కలుగుతుంది!
"గుండె ఆగిపోయింది" అనే బదులు “రెండు గుండెలు ఆగిపోయాయిట” అని అనాల్సివస్తుంది!
నిన్నుచూసి “నాగుండెలో గంటలు మోగాయి” అని కాకుండా “నా రెండు గుండెల్లో గంటలు మోగాయి”అనాల్సివస్తుంది!
"రాధా- నిన్ను నా రెండు గుండెలతో నీ రెండు గుండెలని ప్రేమిస్తున్నా- ఎప్పటికీ ఈ నా రెండు గుండెలు నీవే-అలాగే నీ రెండు గుండెలూ నావే-ఎవరికీ ఇవ్వటానికి లేదు" అని అంటాడు గోపి!
దానికి బదులుగా రాధ...
“నా రెండు గుండెలూ చేసే చప్పుడు, నీ రెండు గుండెలకు వినపడటం లేదా గోపీ” అని అంటుంది!
"పరవాలేదు రాధా ఓ గుండె ఆగిపోయినా నీ రెండుగుండెల కోసం నా రెండో గుండె చప్పుడు చేస్తూనే ఉంటుంది" గోపీ కొత్త డైలాగ్!
రచయితలు కూడా “బహువచనం” రాయడానికి అలవాటు పాడాలి- వాళ్ళ రెండు గుండెలతో!
ఒక గుండెతో ఒకరిని, ఇంకో గుండెతో ఇంకొకరిని ప్రేమిస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాలి- లేకపోతే “గుండెకీబ్బందే”! “నా గుండెల చప్పుడు వింటున్నాను” అని అనడం మొదలుపెడతాం!
ప్రేమికుల మధ్య "నా కోసం ఒక్క గుండెని ఇవ్వలేవా", అనే డైలాగు
అమ్మా నాన్నలతో
"మీకో గుండె, నా ప్రేయసికి ఓ గుండె సమానంగా పంచుతా ప్రేమతో"అనే డైలాగు
తల్లి తండ్రులు- పిల్లలతో
"మా నాలుగు గుండెల కోసమన్నా నీ రెండుగుండెలతో ఇక్కడే ఉండిపో, ఇల్లు వదలద్దు" అనే డైలాగులు బాగా ప్రాచుర్యం పొందుతాయి!
రచయితలకు “రెండుగుండెలనిండా” పనే రెండుచేతులతో బాటు!
హార్ట్ స్పెషలిస్ట్ బదులు “హార్టుల స్పెషలిస్ట్” అని బోర్డు పెట్టుకోవాలి! "ఇక్కడ గుండెలు మార్చబడును" అనే బోర్డులు కూడా వస్తాయి! “రెండు గుండెలతో గట్టిగా ఊపిరి తీసుకోండి” అని డాక్టర్లు చెపుతుంటారు!
గుప్పెడంత బదులు “రెండు గుప్పిళ్లంత గుండెలు” అనాలి, గుప్పెడంత మనసు, “రెండు గుప్పిళ్లంత” మనసు అని అనాల్సివస్తుంది
“నాతో ఇలా మాట్లాడటానికి నీకు ఎన్ని గుండెలు” అన్నప్పుడు- ఠక్కున చెప్పేయచ్చు "రెండు" అని!
“ఇకనుంచి మీ రెండుగుండెల్ని జాగ్రత్తగా చూసుకోవాలి” అనే డైలాగు హృద్రోగనిపుణలకి నాలికమీద ఉంటుంది!
హృద్రోగనిపుణులు “రెండు చేతులతోబాటు రెండుగుండెలతో” ప్రాక్టీస్ చెయ్యొచ్చు-“గుండెలే గుండెలు-వద్దంటే గుండెలు”ప్రాక్టీస్ పెరుగుతుంది-వాళ్లకి మాత్రం పండగే పండగ!
ఉన్న ఒక్క గుండెతోనే నానాయాతన పడుతున్నాం-రెండు గుండెలంటే మాటలా!
ఇప్పటికీ ఇంకా రెండో గుండె కావాలనుకుంటున్నారా- మీ గుండెనడిగి చెప్పండి-నాకైతే గుండె ధైర్యం లేదు!